క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటి షోడశ మహాజనపదాలు, మగధ సామ్రాజ్యం మరియు నాటి సామాజిక-ఆర్థిక జీవనానికి బౌద్ధ సాహిత్యం ప్రాథమిక వనరుగా నిలుస్తుంది.
- త్రిపీటకాలు (పాలి భాష): బుద్ధుని బోధనల సమాహారమైన త్రిపీటకాలు మూడు:
- వినయ పీటకం (ఉపాలి సంకలనం): బౌద్ధ సంఘ సన్యాసుల క్రమశిక్షణ, నియమావళి.
- సుత్త పీటకం (ఆనందుడు సంకలనం): బుద్ధుని మత బోధనలు, సంభాషణలు. ఇందులో దీఘ నికాయ, మజ్జిమ నికాయ, అంగుత్తర నికాయ ముఖ్యమైనవి. అంగుత్తర నికాయ తొలిసారిగా 16 మహాజనపదాల జాబితాను అందించింది.
- అభిధమ్మ పీటకం: మూడవ బౌద్ధ సంగీతిలో మొగ్గలిపుత్త తిస్స చేత సంకలనం చేయబడిన తాత్విక, మానసిక విశ్లేషణ గ్రంథం.
- జాతక కథలు: సుత్త పీటకంలోని ఖుద్దక నికాయలో భాగమైన 549 జాతక కథలు బుద్ధుని పూర్వ జన్మ వృత్తాంతాలను వివరిస్తూనే, ఆనాటి వర్తక శ్రేణులు, నాణేలు, పట్టణ నాగరికత చిత్రణను అందిస్తాయి.
- సింహళ బౌద్ధ గ్రంథాలు: శ్రీలంకకు చెందిన 'దీపవంశ', 'మహావంశ' గ్రంథాలు అశోకుడు శ్రీలంకలో బౌద్ధ ప్రచారం చేసిన వైనాన్ని, మౌర్యుల చరిత్రను నిరూపిస్తాయి.
